సంక్రాంతి అంటే ఇంటి ముందు అమ్మాయిలు వేసే అందమైన రంగవల్లులే కాదు, ధియేటర్స్‌లో సినిమాల సందడి కూడా. అందుకే సినిమాలు వరుస కట్టాయి. అన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. 9న బాలయ్య 'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రం విడుదల కానుంది. 10న రజనీకాంత్ నటించిన 'పేట' ప్రేక్షకుల ముందుకు రానుంది. 11న చరణ్ 'వినయ విధేయ రామ'గా వస్తున్నాడు. 12న 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అంటూ వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా కలిసి వస్తున్నారు. ఇలా చూసుకుంటే వరుస సినిమాలతో ఈ సంక్రాంతి సందడి సందడిగా సాగిపోనుంది.
ఇదిలా ఉంటే, అనువాద చిత్రంగా వస్తున్న 'పేట'కు కొంచెం కష్టమే అనిపిస్తోంది. 9న విడుదలవుతున్న ఎన్టీఆర్ - కథానాయకుడు చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. అలాగే ఫస్ట్ డే కన్నా, సెకండ్ డే మరింత బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఈ సినిమాకి. ఎన్టీఆర్‌ని తెరపై చూసుకోవాలని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య రూపంలో ఎన్టీఆర్‌ని చూసుకోవాలని ఆశపడుతున్నారు. నిజానికి ఇది బాలయ్య సినిమా అనడం కన్నా, ఎన్టీఆర్ మూవీగా అభివర్ణించొచ్చు. ఆ ప్రభావం 'పేట'పై చాలా ఎక్కువే పడుతుంది.
తర్వాతి రోజు చరణ్ దాదాపు ధియేటర్స్ అన్నింటినీ కవర్ చేసేస్తాడు. ఆ తర్వాత 'ఎఫ్ 2'. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల వరుస సినిమాల మధ్య 'పేట' నలిగిపోవడం ఖాయమే. అయితే రజనీని తక్కువంచనా వేయడానికి లేదు. ఇక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ రజనీకి. సో టాలీవుడ్ స్టార్స్‌తో తమిళ సూపర్‌స్టార్ పోటీ ఎలా ఉండనుందో. ఏది ఏమైనా ఈ సంక్రాంతి సినిమాల జోరుతో ఫుల్ జోష్ నింపుకోవడమైతే ఖచ్చితంగా ఖాయమే.