'రాజుగారి గది' సినిమాతో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అందుకున్న యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్, అదే ఊపుతో దానికి సీక్వెల్ రూపొందించాడు. అయితే, రెండో గదికి కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ చేయడంతో, ఆ సినిమా ఆశించిన రిజల్ట్ అందించలేకపోయింది. నాగార్జున వంటి స్టార్ ఫ్లేవర్ అద్దినా ఆ సినిమాని సక్సెస్ చేయలేకపోయాడు ఓంకార్. మూడో గది కోసం కూడా అదే కంటిన్యూ చేయాలనుకున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నాని హీరోయిన్‌గా ఎంచుకున్నాడు.
కానీ తమన్నా బైబై చెప్పడంతో, కాజల్, సమంత.. ఇలా పలువురు స్టార్స్‌ని బతిమలాడాడు. కానీ, కుదరకపోయేసరికి 'ఉయ్యాలా జంపాలా' ఫేమ్ అవికా గోర్‌తో సినిమాని సైలెంట్‌గా పూర్తి చేసేశాడు. అసలు ఈ సినిమాకి అవికా ఫిక్స్ అయ్యిందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు ఓంకార్. ఎలాగైతేనేం లీకుల్లేకుండానే సినిమాని కామ్‌గా పూర్తి చేసేశాడు. ఇక ఇప్పుడు నిర్మాణానంతర కార్యమ్రాలు జరుపుకుంటోంది 'రాజుగారి గది 3'. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశాడు ఓంకార్.
డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా ఈ లుక్ విడుదల చేశాడు. దీని వెనక ఓ బలమైన సెంటిమెంట్ ఉందట. 'రాజుగారి గది' సినిమా టీజర్‌ని వినాయక్ విడుదల చేశాడట. అది కూడా వినాయక చవితి నాడే. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. అదే సెంటిమెంట్ ఇప్పుడూ మూడో పార్ట్‌కీ కంటిన్యూ చేశాడు ఓంకార్. మరి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, డైరెక్టర్ వినాయకుడు, గాడ్ వినాయకుడు కరుణించి, ఓంకార్‌కి హిట్ ఇస్తారా.? చూడాలి మరి. దసరాకి సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.