'నేనంటే భయానికే భయం. నా గురించి వెతకొద్దు..' అంటూ హీరోకి వార్నింగ్ ఇస్తున్న విలన్. ఈ విలన్ అలాంటిలాంటి విలన్ కాదు, ఓ సీరియల్ కిల్లర్. మతిస్థిమితం లేని ఓ సైకో. చాలా పవర్‌ఫుల్. ఇంత పవర్ ఫుల్ విలన్‌ని ఎదుర్కోవడానికి పోలీసాఫీసర్‌గా మన హీరో ఏం చేశాడు.? ఎలాంటి విపత్కర సంఘటనల్ని ఎదుర్కొన్నాడు.? అనేదే 'రాక్షసుడు' కథ. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమిది. తమిళంలో ఘన విజయం సాధించిన 'రాక్షసన్' సినిమాకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు.
బెల్లంకొండ శ్రీనివాస్ వంటి కటౌట్‌కి ఈ సినిమా సరిగ్గా మ్యాచ్ అయ్యే సబ్జెక్టే. కానీ, బెల్లంకొండకు సక్సెస్ ఇవ్వడంలో ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలిక. మొన్న టీజర్ విడుదల చేసి, ఒకింత ఆశక్తి కలిగించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లోనూ సేమ్ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా సినిమాలో 'రాక్షసుడు' ఎవరు.? అన్న విషయాన్ని రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు.? అనేదే అందరిలోనూ నెలకొన్న ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తెర పడాలంటే, ఆగస్ట్ 2 వరకూ వేచి చూడాల్సిందే. ఆ రోజే 'రాక్షసుడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.