టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస చిత్రాలతో దూసుకెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ మాట ఇప్పుడు తెలుగులో అస్సలు వినిపించడం లేదు. అందుకు కారణం 'ఆయ్యారీ' సినిమా కోసం రకుల్ బాలీవుడ్ వైపు దృష్టి పెట్టాకా, టాలీవుడ్ ఆమెకి టాటా చెప్పేసినట్లైంది. దాంతో తెలుగులో రకుల్ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పడలేదు ఆ తర్వాత.
కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. ఇక 'అయ్యారీ' భారీగా నిరాశపరచడంతో, ఇక అటు వైపు రకుల్ కన్నెత్తి చూడదనుకున్నారు. కానీ అక్కడి నుండి మళ్లీ రకుల్‌కి మంచి ఆఫర్ చేజిక్కింది. అజయ్‌దేవ్‌గణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'దే దే ప్యార్ దే' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్‌దేవగణ్‌కు ప్రేయసిగా రకుల్ నటించనుందట. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ. ప్రస్తుతం కొన్ని వైవాహిక జీవితాల్లో నెలకొన్న కొత్త సాంప్రదాయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు.
పెళ్లి చేసుకుని, భార్యతో హాయిగా సంసారం చేస్తున్న ఓ మగాడు మళ్లీ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమను దక్కించుకోవడానికి, భార్యకు తెలియకుండా ఆ వ్యక్తి చేసే కొత్త కొత్త ప్లాన్స్ ఏంటి? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అజయ్‌దేవగణ్‌కి భార్య పాత్రలో సీనియర్ నటి టబు నటిస్తోంది. కాగా ఈ తరహా నేపథ్యంలో తెలుగులో అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చేసింది గుర్తుందా.!
అదే అజయ్, నాగశౌర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దిక్కులు చూడకు రామయ్యా'. తెలుగులో మంచి విజయం అందుకుంది ఈ సినిమా. ఇంచుమించుగా అదే కథాంశాన్ని పోలినట్లుంది ఈ చిత్రం కూడా. ఏదేమైనా మొత్తానికి ఈ చిత్రంతో రకుల్ బాలీవుడ్‌లో మళ్లీ ప్లేస్‌మెంట్‌ని ఫిక్స్ చేసుకుంటుందేమో చూడాలి మరి.