రాజమౌళితో సినిమా అంటే అన్నీ ప్లస్సులే అనుకోవడం పొరపాటు. కనిపించని మైనస్సులు ఉంటాయి. బాహుబలి అతి పెద్ద హిట్ కావొచ్చు. ఆ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతారం ఎత్తి ఉండొచ్చు. కానీ ఏకంగా 5 సంవత్సరాలు ఈ సినిమా కోసం కేటాయించాడు ప్రభాస్. ఆ ఐదేళ్లలో ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసేవాడో, ఎన్ని హిట్లు కొట్టేవాడో తెలీదు గానీ, కచ్చితంగా ఓ 200 కోట్లయినా వెనకేసేవాడు.
ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లదీ ఇదే పరిస్థితి. `ఆర్.ఆర్.ఆర్`లో తమకు అవకాశం వచ్చిందని ఇద్దరు హీరోలు పొంగిపోయారు. ఈ సినిమాతో వీరిద్దరి పేరూ బాలీవుడ్ లో మార్మోగిపోయింది. వీళ్ల రేంజ్ పెరిగింది. ఇవన్నీ వాస్తవాలే. కాకపోతే.. ఏకంగా మూడేళ్లు ఈ సినిమా కోసం స్ట్రక్ అయిపోయారు. ఈ మూడేళ్లలో ఆర్.ఆర్.ఆర్ తప్ప మరో సినిమాపై ధ్యాస పెట్టలేకపోయారు. అరవింద సమేత తరవాత.. ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. ఏకంగా మూడేళ్ల పాటు.. ఎన్టీఆర్ క్యాలెండర్ ఖాళీగా ఉండిపోయింది.
రామ్ చరణ్ పరిస్థితీ అంతే. వినయవిధేయ రామా తరవాత మరో సినిమా రాలేదు. ఆచార్య లో నటించినా... అది చిరంజీవి సినిమాగానే చలామణీ అవుతోంది. అందునా.. ఆ సినిమా కూడా రిలీజ్ కాలేదు. సో.. మూడేళ్ల పాటు ఈ ఇద్దరు హీరోలూ ఖాళీగా ఉండిపోవాల్సివచ్చింది. మూడేళ్లలో ఎన్టీఆర్ మూడు సినిమాలు చేసినా.. దాదాపుగా వంద కోట్లు సంపాదించేవాడు. రామ్ చరణ్ కూడా అంతే.
ఈ మేరకు ఇద్దరు హీరోలు చెరో వంద కోట్లూ కోల్పోవాల్సివచ్చింది. ఆర్.ఆర్.ఆర్ ఎంత పెద్ద హిట్ అయినా... ఈ హీరోలిద్దరికీ వంద కోట్ల పారితోషికం అయితే ఇవ్వరు కదా..? సో.. రాజమౌళి సినిమా అంటే మూడేళ్ల పాటు మరో సినిమా చేయకూడదని హీరోలు ఫిక్సయిపోవాల్సిందే. తదుపరి సినిమా మహేష్ బాబుతోనే. అంటే మహేష్ కూడా మరో మూడేళ్ల పాటు కనిపించడన్నమాట.