RRR తో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. RRR వల్ల ఎక్కువ లాభ పడింది.. రామ్ చరణే. ఇది తన తరువాతి సినిమాలకు చాలా ప్లస్. చరణ్ సినిమాలన్నీ ఇక పాన్ ఇండియా రూపం సంతరించుకోబోతున్నాయి. అయితే.. ఈ క్రేజ్‌ని ఆచార్య వాడుకోలేకపోతోందేమో అనే అనుమానం, సందేహం మెగా ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. చరణ్ నుంచి రాబోయే సినిమా ఆచార్యనే. ఈనెల 29న విడుదల అవుతోంది. అయితే.. ఈ సినిమాని హిందీలో విడుదల చేయడానికి చిత్రబృందం ఏమాత్రం ఆసక్తిని చూపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఆచార్య. ఇందులో చరణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, కాజల్ కథానాయికలు. వీళ్లకూ నార్త్ లో ఫాలోయింగ్ బాగానే ఉంది. చిరుకూడా తెలిసినవాడే. తన సైరా బాలీవుడ్ లో విడులైంది. అయితే.. ఇప్పుడు ఆచార్యని హిందీలో విడుదల చేసే విషయంలో ఆచార్య బృందం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆచార్య ట్రైలర్ 12న విడుదల అవుతోంది. హిందీ ట్రైలర్ విషయం ఇంకా చెప్పలేదు. దాన్ని బట్టి ఆచార్య హిందీలో వెళ్లదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరు.. సైరా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ భయాలతోనే ఆచార్యని హిందీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపించడం లేదేమో అనిపిస్తోంది. అయితే అప్పటిపరిస్థితులు వేరు. ఇప్పటి లెక్క వేరు. చరణ్ ఉన్నాడు కాబట్టి.. నార్త్ లో అభిమానులు ఆచార్య హిందీ వెర్షన్ చూడ్డానికి వచ్చే అవకాశం ఉంది. మరి... ఈ విషయంలో చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.