మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా 'చిరుత' సినిమాతో తెరంగేట్రం చేసిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, వెండి తెరకు తెరంగేట్రం చేసి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యింది. ఇదే విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ తానీ స్థాయికి ఎదగడానికి సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ 11 ఏళ్లలో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూశారు. ఆయన సినీ కెరీర్‌లో రెండో సినిమా అయిన 'మగధీర' తొలి తెలుగు 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. దాంతో పాటు ఎన్నో విజయాలు రామ్‌చరణ్‌ని నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకునేలా చేశాయి. తొలి సినిమా 'చిరుత'లో తన సొంత పేరు చరణ్‌తోనే తెరంగేట్రం చేశాడు. 11వ సినిమా 'రంగస్థలం'లో చిట్టిబాబుగా విమర్శకుల్ని సైతం గెలిచేశాడు. చరణ్‌లోని ఓ కొత్త నటున్ని పరిపూర్ణమైన నటున్ని బయటికి తెచ్చిన సినిమా 'రంగస్థలం'.
డాన్సులు, ఫైట్లు, నటన అన్నింట్లోనూ తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. కానీ ఎక్కడా తండ్రిని అనుకరించలేదు. 'మగధీర', 'రంగస్థలం' రెండు ఇండస్ట్రీ హిట్స్ చరణ్ ఖాతాలో ఉన్నాయి ఈ 11 ఏళ్ల సినీ కెరీర్‌లో. ప్రస్తుతం చరణ్ తన 12వ సినిమాతో బిజీగా ఉన్నాడు. బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుగుతోంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.