దేవిశ్రీ ప్రసాద్ ఓ ఆల్ రౌండర్. క్లాసుకి క్లాసూ, మాసుకి మాసు.. ఇలా ఎవరికి కావాల్సిన పాటలు వాళ్లకు ఇచ్చేస్తుంటాడు. దేవి ఆల్బమ్‌లో అన్ని రకాల పాటలూ వినే ఛాన్సు దక్కుతుంది. కమర్షియల్ మీటర్‌కు సరిపోయేలా పాటలు చేయడంలో దేవి దిట్ట. అందుకే... ఇన్నేళ్లుగా తనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. దేవి నుంచి వచ్చిన మరో కంప్లీట్ ఆల్బమ్ 'వినయ విధేయ రామ'. ఇంతకు ముందు రామ్ చరణ్‌తోనూ, బోయపాటితోనూ దేవి పనిచేశాడు. అందుకే వాళ్ల సినిమాలకు ఎలాంటి సంగీతం కావాలో తనకు బాగా తెలుసు.
దానికి తగ్గట్టుగానే 'వినయ విధేయ రామ' పాటలు కంపోజ్ చేశాడు. ఇప్పటికే 'తందానే తందానే', 'తస్సాదియ్యా' పాటలు విడుదల అయ్యాయి. తందానే తందానే కుటుంబ నేపథ్యంలో సాగే పాట. వినయ విధేయ రామాలో మాస్ అంశాలతో పాటు, ఫ్యామిలీ ఎటాచ్‌మెంట్స్ కూడా ఉండబోతున్నాయని ఈ పాట తేల్చి చెప్పేసింది. ఈ ఆల్బమ్‌లో ముందుగా విడుదలైంది ఈ గీతమే. టైటిల్‌కి తగిన జస్టిఫికేషన్ ఈ పాటలో కనిపించేసింది.
ఆ తరవాత.. 'తస్సాదియ్యా' పక్కా మాస్ నెంబర్. చరణ్ అనగానే డాన్సులు ఆశిస్తారు ఫ్యాన్స్. వాటికి తగినంత స్కోప్ ఇస్తూ సాగిన పాట ఇది. 'ఏక్ బార్' అనే పాట వింటే ఇది ఐటెమ్ నెంబర్ అని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ పాట కోసం.. బాలీవుడ్ నుంచి ఓ ముద్దు గుమ్మని కూడా దిగుమతి చేశారు. దేవి స్వయంగా ఆలపించిన పాట ఇది. ఈ ఆల్బమ్‌లో దేవిశ్రీ పాడిన పాట ఇదొక్కటే. దేవిశ్రీ ప్రసాద్ ఐటెమ్ పాటంటే.. ఓ హుక్ లైన్ తప్పకుండా ఉంటుంది. అది ఈ పాటలో మిస్సయిన ఫీలింగ్ కలుగుతోంది.
'రామ లవ్స్ సీత' మరో యుగళ గీతం. దీన్నీ మాస్‌కి నచ్చేలా కంపోజ్ చేశాడు దేవి. ఈ పాటలన్నీ శ్రీమణి రాస్తే.. చివరి పాట 'అమ్మానాన్న' రామజోగయ్యశాస్త్రి రచించారు. ఈ సినిమా థీమ్ చెప్పే పాటల్లో ఇదొకటి. పేథాస్ ఫీల్‌తో కలిగిస్తూ సాగిన మంచి మెలోడీ. మొత్తానికి అయిదు పాటలూ అయిదు రకాలుగా కంపోజ్ చేశాడు దేవి. అయితే మాస్‌కే పెద్ద పీట వేశాడు. చరణ్ నుంచి అభిమానులు ఆశించేది మాస్ గీతాలే కాబట్టి.. దేవి ఫ్యాన్స్‌కి నచ్చే ఆల్బమ్ ఇచ్చాడనే అనుకోవాలి.