ఈమధ్య మన కథానాయకులు పక్క రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తమిళంలో తమ సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలి? హిందీలోకి ఎలా దూసుకెళ్లాలి? మలయాళ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి? ఇలాంటి లెక్కలేసుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రం... 'తెలుగులో మంచి మార్కెట్ ఉంది కదా, పక్క భాషలపై ఆశ పడడం ఎందుకు' అంటున్నాడు. 'హిందీలో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ ఉందా?' అని అడిగితే..చరణ్ రియాక్షన్ అది.
''తెలుగులో మార్కెట్ బాగుంది. ఇక్కడ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. హిందీ వాళ్లే మన దగ్గరకు రావాలని ఆశ పడుతున్నారు. అలాంటప్పుడు ఇవన్నీ వదిలేసి అక్కడకు వెళ్లలేం'' అని క్లారిటీగా చెప్పేస్తున్నాడు. అదీ నిజమే. ఎందుకంటే తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. తెలుగులో ఓ సినిమా రూ.200 కోట్లు సాధించగల రేంజ్‌కి వెళ్లింది. డబ్ చేసుకుంటే.. బాలీవుడ్ లోనూ విడుదల చేసుకోవొచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి హిందీ సినిమా చేయడం ఎందుకు?
అన్నింటికంటే మించి... 'జంజీర్' పరాజయం చరణ్‌ని బాగా భయపెట్టి ఉంటుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన క్లాసిక్ సినిమా అది. దాన్ని అదే పేరుతో రీమేక్ చేశాడు. తెలుగులో 'తుఫాన్' పేరుతో డబ్ అయ్యింది. రెండు చోట్లా ఈ బొమ్మ ఫ్లాపే. ఈ పరాజయంతో... చరణ్‌కి నిజానిజాలు అర్థమయ్యాయి. బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అనే ఆలోచనలో పడ్డాడు. అందుకే... ఇలాంటి కామెంట్లు పాస్ చేస్తున్నాడు.