బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'మణికర్ణిక'. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ మొదటి నుండీ ఆకట్టుకునేలా ఉంది. కంగనా ఇంట్రడక్షన్ సీన్ అయిన పులిని వేటాడే సీన్, కత్తిసాములో కంగనా పనితనం, ఆమె వివాహం, బిడ్డ పుట్టడం, ఝాన్సీ రాణిగా, ఝాన్సీని కాపాడే ప్రయత్నంలో భర్తను, బిడ్డను కోల్పోవడం ఆ తర్వాత కదన రంగాన బ్రిటిషర్స్‌ని చీల్చి చెండాడడం ఇలా.. పలు అంశాలను ట్రైలర్‌లో డీటెయిల్డ్‌గా చూపించారు.
ఇంతవరకూ పుస్తకాల్లోనే వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధని చదివి తెలుసుకున్నాం. ఇప్పుడు, క్రిష్, కంగనాల పుణ్యమా అని వెండితెరపై చూడగలిగే అవకాశం దక్కుతోంది. 'లక్ష్మీభాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ఉన్నంతవరకూ ఝాన్సీని కాపాడుతాను..' అంటూ కంగనా చేసిన ప్రమాణం, రాణి పాత్రలో ఆమె రాజసం ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. 'క్వీన్' తర్వాత మరోసారి నట విశ్వరూపం ప్రదర్శించింది కంగనా రనౌత్. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చారిత్రక గాధకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
కాగా క్రిష్ మధ్యలో 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం ఈ సినిమా డైరెక్షన్ నుండి తప్పుకోగా, ఆ బాధ్యతను కంగనానే నిర్వహించింది. మొత్తానికి టైటిల్స్‌లో డైరెక్షన్ విభాగంలో ఈ ఇద్దరి పేర్లు ఉండడం విశేషం. కాగా ట్రైలర్‌కి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ సినిమా డైరెక్షన్ నుండి క్రిష్ తప్పుకున్నాక, సినిమాపై పలు రకాల గాసిప్స్ వచ్చాయి. ఒకానొక టైంలో ఇది విడుదలయ్యే సినిమా కాదనే టాక్ కూడా ప్రచారమైంది. అయితే ఎట్టకేలకు కంగనా సినిమాని పూర్తి చేసి తన బాధ్యతను నెరవేర్చుకుంది. జనవరి 25న 'మణికర్ణిక' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.