తాను చెప్పాలనుకున్నది చెప్పడంలో రామ్‌గోపాల్ వర్మ ఏమాత్రం వెనుకడుగు వేయడు. అది తప్పా? ఒప్పా? అన్నది వేరే విషయం. నమ్మిన విషయానికి కట్టుబడి వుంటాడాయన. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో చేస్తోన్నది అదే. సినిమా విడుదలయ్యాక నిర్మాతకి లాభాలు తెస్తుందా? నష్టాల్ని మిగుల్చుతుందా? అన్నది వేరే చర్చ. ఏ పార్టీ, రామ్‌గోపాల్ వర్మతో ఈ సినిమా తీసేలా చేసిందన్నది ఇంకో చర్చ.
కానీ, రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం పడుతున్న తపనకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ రోజల్లో ఏ దర్శకుడూ ఇంతలా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడు. తన సినిమాని ప్రమోట్ చేసుకునే క్రమంలో రామ్‌గోపాల్ వర్మ చూపుతున్న శ్రద్ధ పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 22న విడుదల కావాల్సిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్', ఇప్పుడు మార్చి 29వ తేదీకి వెళ్ళింది. అనుకున్న సమయానికే సినిమాని విడుదల చేయాలని వర్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అయితేనేం, వర్మ మాత్రం తన పబ్లిసిటీ స్టంట్స్ ఆపలేదు. సినిమాపై హైప్ చల్లారకుండా తనవంతు కృషిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలతో తలపడేందుకూ వర్మ సిద్ధపడుతున్న వైనం ఆశ్చర్యకరమే. భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఎన్‌టిఆర్ బయోపిక్'తో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని పోల్చలేం. అది చప్పగా సాగిన సినిమాల కథ. ఇది కాకరేపుతున్న వ్యవహారం. ఎప్పుడొచ్చినా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు ఎన్నికల ముందే దక్కాలని వర్మ అభిమానులు భావిస్తున్నారు.