సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్లానింగ్‌లో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ రాకేష్‌రెడ్డి, రామ్‌గోపాల్ వర్మల మధ్య ప్రీక్వెల్ విషయమై చర్చలు జరుగుతున్నాయట. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజైన వెంటనే ఆ ప్లాన్‌ని వర్కవుట్ చేస్తారనీ సమాచారమ్.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిజల్ట్‌ని బట్టి ప్రీక్వెల్ అనౌన్స్ చేసే యోచనలో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన దగ్గర నుండి ఆయన జీవితంలో జరిగిన, రాజకీయంగా జరిగిన పరిణామాలను కథాంశంగా తీసుకుని 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రీక్వెల్‌లో ఏముండబోతోంది.? అసలేం చూపించబోతున్నారు వర్మ.? అనేది తెలియాలంటే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల వరకూ ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే మరోవైపు లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి రాక ముందు ఆమె జీవితం ఏంటీ.? అనే కథాంశంతో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంధం' పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఏం చూపించబోతున్నారో ఆల్రెడీ చూచాయగా చెప్పేశారు. అయితే ఆ సినిమా విడుదలైతే కానీ, అసలు సంగతి తెలీదనుకోండి. ఇక తాజాగా తెరపైకి వచ్చిన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రీక్వెల్ కథేంటో చూడాలిక.