ఇటీవల తెలుగు చిత్రాలకు నార్త్ లో క్రేజ్ బాగా పెరుగుతుంది. ఉత్తరాది సినీ ప్రేక్షకులు తెలుగు చిత్రాలవైపు బాగా మొగ్గుచూపుతున్నారు. దాంతో.. హిందీకి డబ్బింగ్ చేయబడిన తెలుగు చిత్రాలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో ఫెయిల్ అయిన చిత్రాలకు కూడా, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' అలాంటి రికార్డే క్రియేట్ చేసింది.
2017లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా అనుపమ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించించిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. 'నెం.1 దిల్ వాలా' పేరుతో హిందీలోకి అనువదించబదిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 33 మిలియన్ల యూట్యూబ్ వ్యూస్ సాధించింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
స్నేహం విలువను తెలియచెప్పే అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించబడిన ఈ చిత్రం తెలుగులో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా.. అనువాద చిత్రంగా మాత్రం ఊహించని విజయాన్ని సాధించింది. హిందీ అనువాద హక్కులను సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మనీష్ షా ఈ అరుదైన రికార్డు సృష్టించిన క్రమంలో ఆనందాన్ని వ్యక్తం చేసారు. దీన్ని బట్టి హీరో రామ్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని తెలుస్తుంది.