ఇస్మార్ట్ శంకర్‌తో ఓ పెద్ద హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. ఆ సినిమా 50 రోజులు దాటేసింది. అయినా తన కొత్త సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. రామ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడని, ఇస్మార్ట్ శంకర్ తరవాత ఏ సినిమా చేయాలో అర్థం కాక, జుత్తు పీక్కుంటున్నాడని, అందుకే తదుపరి సినిమా విషయంలో ఇంత జాప్యం వచ్చిందని గుసగుసలు వినిపించాయి. కానీ అలాంటిదేం లేదు. రామ్ తదుపరి సినిమా ఎప్పుడో ఫిక్సయిపోయింది.
ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తారు. నేను శైలజతో ఎంట్రీ ఇచ్చాడు కిషోర్ తిరుమల. ఆ వెంటనే రామ్‌తో ఉన్నది ఒకటే జిందగీ తీశారు. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ సినిమా అన్నమాట. అయితే ఇది తడమ్ అనే తమిళ చిత్రానికి రీమేక్. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించారు. ఇదో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. తెలుగులో స్క్రిప్టు పనులు పూర్తయిపోయాయి. అక్టోబరులో ఈచిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. స్రవంతి మూవీస్ నిర్మించనుంది.