ఇస్మార్ట్ శంకర్ తరవాత.. రామ్ లెవిల్ పెరిగింది. ఆ సినిమా 50 కోట్లు సాధించడంతో... తన మార్కెట్ బాగా విస్కృతమైంది. అందుకే తదుపరి సినిమా `రెడ్` పై భారీ అంచనాలు నెలకున్నాయి. తమిళ సినిమా తడమ్ కి రీమేక్ కావడం, రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం, సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా విడుదల కావడం ఇలా అన్నీ కలిసొచ్చాయి. అయితే... బాక్సాఫీసు దగ్గర మాత్రం మిశ్రమ ఫలితాన్ని చవి చూడాల్సివచ్చింది.
ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు పెదవి విరిచాడు. తడమ్ తో పోలిస్తే... అంత గొప్పగా లేదని విశ్లేషకులు తేల్చేశారు. కాకపోతే.. సంక్రాంతి సీజన్ వల్ల కలిసొచ్చింది. మొత్తంగా 20 కోట్ల వసూళ్లు అందుకుంది. నిజానికి ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు భారీగా వచ్చాయి. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తే 35 కోట్లు ఇస్తామని బేరం పెట్టారు. కానీ.. నిర్మాత ఒప్పుకోలేదు. రామ్ కూడా ససేమీరా అన్నాడు. ఇస్మార్ట్ శంకర్ లా ఇది కూడా 50 కోట్లు సాధించేస్తుందన్న ధీమా వాళ్లది. తీరా చూస్తే 20 కోట్ల దగ్గరే ఆగిపోయింది. బయ్యర్లు.. బ్రేక్ ఈవెన్‌కి దగ్గరకు వెళ్లారు. కొన్ని చోట్ల లాభాలొచ్చాయి. కాకపోతే.. నిర్మాత మాత్రం మంచి లాభాల్ని చవి చూశాడు.
నైజాంలో ఈ సినిమా 6.5 కోట్లు సాధించింది. సీడెడ్ లో 3.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు తెచ్చుకుంది. ఆంధ్రా తెలంగాణ కలిపి 18.5 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లో 40 లక్షలు సంపాదించింది. ఇలా.. మొత్తంగా చూస్తే అటూ ఇటుగా 20 కోట్లు వచ్చినట్టు.