'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!

మరిన్ని వార్తలు

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న 'అరణ్య' చిత్రం 2020లోనే అతిపెద్ద అడ్వెంచర్ డ్రామా. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా, మూడింటిలోనూ రానా హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అరణ్య', తమిళ వెర్షన్ 'కాడన్'లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వెర్షన్ 'హాథీ మేరీ సాథీ'లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు. మరో రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు.

 

కాగా ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడంటూ ఇటు సినిమా వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో చర్చలు నడుస్తున్నాయి. రానా ఫస్ట్ లుక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అప్పట్నుంచే ఆయన అభిమానులు దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో స్పందనకు అంతు లేదు. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఆ పాత్ర కోసం రానాతో పలు రకాల లుక్స్ ప్రయత్నించారు దర్శకనిర్మాతలు. వాటిలో దేన్ని ఫైనల్ చేశారో మొదటిరోజు షూటింగ్ లో పాల్గొనేదాకా ఆయనకు కూడా వారు చెప్పలేదు.

 

ఆ పాత్ర కోసం తన రూపాన్ని ఎలా మార్చుకున్నదీ రానా వెల్లడించారు. "డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువుతగ్గడం అనేది చాలా క్లిష్టమైన పని. బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్" అని ఆయన తెలిపారు.

 

ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో 'అరణ్య'గా, తమిళంలో 'కాడన్'గా, హిందీలో 'హాథీ మేరే సాథీ'గా 2020 ఏప్రిల్ 2 గురువారం విడుదలకు సిద్ధమవుతోంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. వన్యప్రాణుల్నీ, ప్రకృతినీ కాపాడుకోవడానికి జరిగే ఘర్షణలో ఆయన ఏవిధంగా భాగమవుతాడో ఈ సినిమాలో మనం చూడనున్నాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS