2018లో వచ్చిన సినిమాల్లో 'రంగస్థలం' ది బెస్ట్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆ సినిమా కోసం ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్, అందులోని నటీనటుల ప్రతిభ.. ఇవన్నీ ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించడానికి కారణాలు.
ఓ కమర్షియల్ హీరో, తన చుట్టూ గీసి వున్న గీతను దాటి చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా చరణ్ చేయడమేంటి? అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు. 'చెవిటి చిట్టిబాబు' మాత్రం, టాలీవుడ్‌కి రీసౌండ్ వచ్చేలా బంపర్ హిట్ కొట్టాడు. 100 కోట్ల క్లబ్‌లోకి చేరడమే కాదు, 'బాహుబలి' తర్వాత అత్యధిక వసూళ్ళను సాధించిన తెలుగు సినిమాగా 'రంగస్థలం' రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ 'చిట్టిబాబు' బుల్లితెర మీదకు వచ్చేస్తున్నాడు. విజయదశమి కానుకగా, ఈ వీకెండ్‌లో బుల్లితెరపై 'రంగస్థలం' సందడి చేయబోతోంది.
బుల్లితెరపై సినిమా ప్రదర్శితమవడమంటే, ముందుగా ఆ సినిమా సాధించే టీఆర్పీ రేటింగ్ గురించే అంతా ఆలోచిస్తారు. కానీ, ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 'రంగస్థలం' సినిమా ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసేస్తోంది. థియేటర్లలో చూసేసి, ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదా ఓ లుక్కేసేసిన జనం, 'బుల్లితెరపై' ఇంకోసారి చూసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారనే ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే, 'రంగస్థలం' ఫీవర్ ఇంకా చల్లారిపోలేదు. 'రంగస్థలం' పాటలు ఎక్కడో ఓ చోట ఇంకా మార్మోగుతూనే వున్నాయి.
సో, 'రంగస్థలం' సినిమాపై బుల్లితెర వీక్షకులు ఓ కన్ను గట్టిగానే వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. అభిమానులైతే, ఈ సినిమా బుల్లితెరపైనా సంచలనం సృష్టించబోతోందని అంచనా వేస్తున్నారు. చూడాలిక, చిట్టిబాబు బుల్లితెర హంగామా ఎలా ఉంటుందో.