టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకులలో అగ్రస్థానంలో ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయన తాత్కాలికంగా సినిమాలకు దూరం అయి ఉండొచ్చు. కానీ.. ఇప్పటికీ పవన్ ఓకే అంటే కోట్లకు కోట్లు పారితోషికాలు ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడతారు. అత్యధిక ఆదాయపు పన్ను కట్టే సెలబ్రెటీల జాబితాలో పవన్ పేరు తప్పకుండా ఉంటుంది. అలాంటి పవన్ కు రూ.33 కోట్ల అప్పులున్నాయి. ఈ విషయాన్ని పవన్ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు.
ఓ స్టార్ హీరో, అందునా యూత్‌లో అపారమైన క్రేజ్ ఉన్న ఓ హీరోకి ఇన్ని అప్పులా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా ఆయన త్రివిక్రమ్ దగ్గరే రెండు కోట్ల పైచిలుకు అప్పు చేశారన్న సంగతి అఫిడవిట్లో తేలింది. మరి ఈ అప్పులకు కారణమేంటి? అనే విషయంపై పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. కొంతకాలం క్రితం పవన్ .. రేణూ దేశాయ్‌కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భరణం రూపంలోనే ఏకంగా 40 కోట్లు ఇచ్చారని సమాచారం. అప్పుడు చేసిన అప్పులు వడ్డీలతో సహా పెరిగి పోయాయని తెలుస్తోంది.
అంతేకాదు... గతంలో కొంతమంది నిర్మాతల దగ్గర పవన్ అడ్వాన్సులు తీసుకున్నారు. కానీ సినిమాలు మాత్రం చేయలేదు. ఆమేరకు పవన్ అప్పు పడినట్టే. ఇవన్నీ కలిసి రూ.33 కోట్లు అయ్యాయి. పైగా పవన్ కి గుప్త దానాలు చేసే అలవాటు ఉంది. అడిగినవాళ్లకు, అడగనివాళ్లకు లక్షల కొద్దీ దానం చేస్తుంటాడు. పైగా సినిమాలు చక చక చేసే అలవాటు లేదు. పార్టీ స్థాపించడం, దాన్ని అయిదేళ్ల పాటు కొనసాగించడం మాటలు కాదు. దానికి కూడా మూల ధనం అవసరం. ఈ మేరకు పవన్ బాగా ఖర్చు చేయాల్సివచ్చింది. ఇవన్నీ అప్పుల రూపంలో తేలాయి.