ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాలలో దిగబోతున్నాడు పవన్ కళ్యాణ్. భీమవరం, గాజువాకలలో ఆయన పోటీ చేయనున్నారు. గాజువాకలో ఆయన గెలుపు లాంఛనమే అన్నది పొలిటికల్ రిపోర్ట్. భీమవరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి పవన్‌కి ముప్పు వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్‌కీ, భీమవరంలో పవన్ గెలుపుకీ ఉన్న లింకేంటి? అంటారా...? అక్కడికే వస్తున్నాం.
భీమవరంలో కొన్నాళ్ల క్రితం పవన్ ఫ్యాన్స్ కీ ప్రభాస్ ఫ్యాన్స్‌కీ మధ్య గొడవ చెలరేగింది. ఓ ఫ్లెక్సీ కారణంగా పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. చివరికి పెద్దలు దిగి వచ్చి రాజీ కుదిర్చారు. అప్పటి నుంచీ ఒకరంటే ఒకరికి పడడం లేదు. సరిగ్గా అదే భీమవరంలో పవన్ నిలబడ్డాడు. భీమవరం ఏరియాలో రాజుల ప్రాబల్యం ఎక్కువ.
అక్కడ క్షత్రియుల ఓట్లు దాదాపు 50 వేల వరకూ ఉన్నాయి. వీళ్లంతా ప్రభాస్ ఫ్యాన్స్‌కాకపోవొచ్చు. కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పవన్‌కి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. సినిమా సినిమానే, రాజకీయాలు రాజకీయాలే అని వేరు చేసి చూస్తే తప్ప... వాళ్ల ఓట్లు పవన్‌కి పడవు. ఒకవేళ క్షత్రియులంతా పవన్‌కి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. భీమవరంలో పవన్ గెలుపు కష్టమే అవుతుంది. మరి ఈ గండం నుంచి పవన్ ఎలా గట్టెక్కుతాడో చూడాలి.