నందమూరి హీరోలెప్పుడూ తమ అభిమానులతో మమేకం అవుతూనే ఉంటారు. వాళ్లతో తరచూ మీటింగులు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అర్జెంటుగా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు టాక్. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ కీలకమైన అభిమానులు ఈ మీటింగులో పాల్గొంటారని టాక్. ఈ మీటింగ్‌కి రెండు కారణాలున్నాయి.
ఇటీవల బాలకృష్ణ నుంచి వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలకు సంబంధించి అభిమానులు ఏమనుకున్నారు? ఈ స్థాయిలో ఈ రెండు చిత్రాలూ ఫ్లాప్ అవ్వడానికి కారణమేంటి? అనే విషయాన్ని అభిమానుల నుంచి తెలుసుకోబోతున్నాడట బాలయ్య. వసూళ్లు తక్కువగా రావడానికి గల కారణమేంటి? సోషల్ మీడియాలో నెగిటీవ్ ప్రచారం, ట్రోలింగులు ఏమైనా దెబ్బతీశాయా? అనే విషయాలు తెలుసుకోవడానికి బాలయ్య ఈ మీటింగు నిర్వహిస్తున్నాడని టాక్.
రెండోది.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏరియాల వారిగా టీడీపీ బలాబలాలేంటి? ఎక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి? ఎక్కడ ఎవరితో పోటీ ఎదుర్కోవాల్సివస్తోంది? అనే విషయాల్నీ ఆరా తీయబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఫ్యాన్ మీటింగులో కేవలం బాలకృష్ణ మాత్రమే పాల్గొంటాడని తేలింది. మరి ఆ మీటింగ్ ఎప్పుడు, ఎక్కడ అనేది తెలియాల్సివుంది.