కొన్ని సినిమాలు జేబులు నింపుతాయి. కొన్ని సినిమాలు మాత్రం జేబుల వెనకున్న గుండెల్ని తాకుతాయి. అలా గుండెను తాకిన సినిమా జెర్సీ. ఇదో సినిమా కాదు.. జీవితం. దర్శకుడు గౌతమ్ తెరపై జీవితాన్ని ఆవిష్కరిస్తే... నాని 'అర్జున్' పాత్రకి ప్రాణం పోసాడు. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండ తీసిన ఈ సినిమా.. వందేళ్ల తెలుగు సినిమా అనే పుసక్తం వేస్తె అందులో దర్జాగా స్థానం సంపాయించుకునే సినిమాగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ క్లాసిక్స్ తీసుకుంటే... అందులో సూపర్ హీరోల కధలు వుండవు. మామూలు వ్యక్తుల జీవితాలే తెరమీద చెరగని ముద్రలు వేశాయి. జెర్సీ కూడా ఆ కోవకు చెందిన సినిమానే.
ఇది ఒక స్ట్రగులింగ్ క్రికెటర్ జీవితమే కాదు.. ఓ తండ్రి కథ. తన కొడుకు ద్రుష్టిలో హీరోగా కనపడాలని తపించే ఓ తండ్రి కథ. నాని ఇంతకుముందే మంచి నటుడిగా ముద్ర వేసాడు. కానీ జెర్సీతో ఒకేసారి మరో పదిమెట్లు ఎక్కాడు. ఒక సినిమా యునానిమస్ గా విమర్శకుల ప్రశంసలు పొందడం అరుదు. అలాంటిది జెర్సీ మాత్రం హోల్ సేల్ గా క్రిటిక్స్ మనసునూ దోచేసిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతోంది.