ఈ వారం బాక్సాఫీసు ముందుకు ఏకంగా 4 సినిమాలొచ్చాయి. మహానాయకుడు, మిఠాయి, అంజలి సీబీఐ మరియు 4 లెటర్స్ సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. మరి వీటి జాతకం ఎలా సాగింది? బాక్సాఫీసు దగ్గర వచ్చిన ఫలితం ఏమిటి? ప్రేక్షకులు, సినీ విమర్శకులు ఏం మాట్లాడుకుంటున్నారు?
ముందుగా 'మహానాయకుడు' గురించి చెప్పుకోవాలి. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండవ, చివరి భాగమిది. తొలి భాగం 'కథానాయకుడు' డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాపై అటు చిత్రబృందం, ఇటు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తొలిభాగం నష్టాల్ని ఈ సినిమా పూడుస్తుందని బయ్యర్లు నమ్మారు. కానీ.. అవన్నీ తలకిందులైపోయాయి. కనీసం 'కథానాయకుడు'కి వచ్చిన ఓపెనింగ్స్ కూడా 'మహా నాయకుడు'కి రాలేదు. పైగా రివ్యూలూ అంతంత మాత్రంగానే వచ్చాయి.
చంద్రబాబు నాయుడుని హీరోగా చూపించడానికి ప్రయత్నించారని, ఎమోషన్లు మిస్ అయ్యాయని, డ్రామా ఎక్కువైందని విమర్శలు వచ్చాయి. తొలి రోజు 1.6 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజూ.. బాగా నిరాశ పరిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి కనీసం 10 కోట్లయినా వస్తాయా, రావా? అనేది అనుమానంగా మారింది.
ఇక.. 'మిఠాయి' విషయానికొద్దాం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రమిది. హాస్య నటులుగా వీరిద్దరికీ మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు వీళ్ల టైమింగ్ బాగుంటుంది. వినోద భరితమైన చిత్రంగా ఈ సినిమా అంతో ఇంతో వసూళ్లు తెచ్చుకుంటుందనుకున్నారు. కానీ.. ఈ మిఠాయి చేదెక్కింది. కథ, కథనాల పరంగా, టేకింగ్ పరంగా నాశిరకమైన సినిమాగా మిగిలిపోయింది.
చివరికి రాహుల్ రామకృష్ణ 'ఇలాంటి సినిమా చేసినందుకు మన్నించండి.. భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయను' అంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సివచ్చింది. నయనతార కథానాయికగా నటించిన డబ్బింగ్ సినిమా 'అంజలి సీబీఐ'నీ, కొత్త వాళ్లతో చేసిన '4 లెటర్స్'ని ఎవరూ పట్టించుకోలేదు. నయనతార సినిమాకే కాస్తో కూస్తో ఓపెనింగ్స్ వచ్చాయి. మిగిలివన్నీ.. బాగా నిరాశ పరిచాయి. 4 లెటర్స్, మిఠాయి సినిమాలకు కనీసం ప్రచారం కూడా లేకపోయింది.
వచ్చేవారం కళ్యాణ్ రామ్ నటించిన '118' విడుదల అవుతోంది. అదైనా వసూళ్ల పరంగా బాక్సాఫీసుకు జోష్ తీసుకొస్తుందేమో చూడాలి.