కోడిరామకృష్ణకూ, చిరంజీవికీ ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. దర్శకుడిగా కోడి రామకృష్ణ తొలి సినిమా... చిరంజీవితోనే. 'ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య'తో దర్శకుడిగా కోడి రామకృష్ణ అరంగేట్రం చేశారు. 'రిక్షావోడు', 'అంజి' లాంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. కోడి రామకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువ. ఆ సెంటిమెంట్లతో చిరంజీవి కూడా ఓ ఆట ఆడుకున్నాడు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరు కోడిరామకృష్ణకు ఓ పరీక్ష పెట్టి, ఇరకాటంలో పడేశాడు.
కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.. ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య షూటింగ్ జరుగుతోంది. పాల కొల్లులో షూటింగ్. పక్కనే ఉన్న మొగల్తూరు చిరంజీవి పుట్టిన ఊరు. అందుకని చిత్రబృందానికి మొగల్తూరులో లంచ్ ఏర్పాటు చేశారు చిరంజీవి. భోజనం ముగించుకుని నారింజ వలుచుకుని తింటున్నప్పుడు సీన్ చెప్పడానికి కోడి రామకృష్ణ అక్కడకు వెళ్లారు.
'రామకృష్ణ.. సరదాగా ఓ ఆట ఆడదాం.. నేను ఇక్కడ్నుంచి నారింజ తొనని విసురుతాను. అది నీ నోట్లో పడితే.. మన సినిమా హిట్టు. లేదంటే లేదు' అన్నాడట చిరు. దాంతో కోడి రామకృష్ణకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. పొరపాటున నారింజ తొన తన నోట్లో పడకపోతే పరిస్థితేంటి? అనే భయం వేసింది. కానీ. హీరో చెప్పాడు కదా? ఇష్టం లేకపోయినా ఆట ఆడాల్సిందే. దానికి కోడి కూడా అయిష్టంగా తల ఊపాడు. తింటున్న నారింజ లోని ఓ తొన తీసుకుని 'వన్ టూ త్రీ' అంటూ కోడి రామకృష్ణ నోట్లోకి గురి చూసి వదిలాడట చిరు.
అది సరిగ్గా.. కోడి రామకృష్ణ నోట్లో పడింది. దాంతో కోడి ఆనందానికి అవధుల్లేవు. 'మన సినిమా హిట్టే సార్' అంటూ గట్టిగా అరిచి చెప్పాడట. అనుకున్నట్టుగానే ఆ సినిమాతో కోడి రామకృష్ణ తెలుగు నాట దర్శకుడిగా స్థిరపడిపోయాడు. ఏకంగా 140 సినిమాలు తీసేశాడు. ''ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే.. టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆ తొనని అందుకోకపోతే.. ఒత్తిడి పెరిగిపోయేది. షూటింగ్ సరిగా చేసేవాడ్ని కాదు. చిరంజీవిగారు తొన నోట్లో పడాలని చాలా జాగ్రత్తగా గురి చూసి వదిలారు'' అని గుర్తు చేసుకునేవారు కోడిరామకృష్ణ.