రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమేనని ఎప్పటినుంచో చెప్పుకుంటూనే వున్నాం. అవును, నిజంగానే ఆయన ఏం చేసినా అది సంచలనమే అవుతోంది. సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే, ప్రతి సినిమాకీ సంచలనాత్మక హైప్ క్రియేట్ చేయడం వర్మకే చెల్లింది. ఆ విషయం పక్కన పెడితే, తాజాగా కరోనాపై వర్మ నుంచి ఓ పాట పుట్టుకొచ్చింది. సిరాశ్రీ రాసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెడింగ్‌గా మారుతోంది. కరోనా మీద చాలా అద్భుతంగా ఇందులో పదాల్ని చొప్పించారు. నేను గొప్ప.. అనుకునే మనిషి, చంద్రుడి మీద అడుగు పెట్టాడుగానీ.. తన కంటికి కనిపించని కరోనా వైరస్ దెబ్బకి ఇంట్లో దాక్కున్న వైనం గురించి వర్మ స్టయిల్లో ఈ పాటలో చెప్పేశారు.
స్టార్లు అయినా, ఇంకెవరైనా.. కరోనా దెబ్బకు భయపడాల్సిందేన్న వాస్తవాన్నీ చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. మతాలకు సంబంధించిన గుర్తులతో మొదలైన సాంగ్‌లో, మనిషి తన మనుగడ కోసం ప్రకృతిని నాశనం చేస్తున్న విషయాన్నీ ప్రస్తావించారు. ఓవరాల్‌గా ఇది ఓ ఆలోచించేసే పాట. అయితే, వాయిస్ ఒకింత ఇబ్బందికరంగా అన్పిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బాగానే కుదిరాయి.