సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి సంబంధించి కీలకమైన 'అప్‌డేట్' కాస్సేపట్లో వెలుగు చూడనుంది. మార్చి 22న విడుదల కావాల్సిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కొన్ని అనివార్య కారణాలతో మార్చి 29కి వాయిదా పడిన విషయం విదితమే. అయితే, సినిమాపై కొన్ని రాజకీయ అభ్యంతరాలు వ్యక్తమవడంతో సినిమా విడుదలపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. ఎన్నికల కమిషన్ తనకు అందిన ఫిర్యాదులపై స్పందించింది.
సినిమా చూపించాలని ఎన్నికల కమిషన్, చిత్ర నిర్మాతని కోరినట్లు తెలుస్తోంది. ఇంకోపక్క సెన్సార్ విషయమై కూడా కొంత కన్‌ఫ్యూజన్ కొనసాగుతోంది. అన్ని ప్రశ్నలకూ మరికొద్ది గంటల్లోనే సమాధానం దొరుకుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ప్రీమియర్ వేస్తారా? వేస్తే, ఆ తర్వాత పరిస్థితి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి అనుకూలంగా వుంటుందా? సెన్సార్ దగ్గర ఈ సినిమాకి ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి అంశాలపై కొంత ఉత్కంఠ అయితే ఇంకా అలాగే వుంది.
పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదం, ఈ సినిమాకి అనూహ్యమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. టీడీపీ ప్రత్యర్థి వర్ఘం, ప్రధానంగా ఈ సినిమా పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల్ని ఈ సినిమాలో చూపించబోతున్న సంగతి తెల్సిందే. పాటలు, ట్రైలర్ ఇప్పటికే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి.