హీరోయిన్ చెల్లెలి పాత్రల్లోనూ, ఫ్రెండ్స్ పాత్రల్లోనూ నటించి, కొన్ని కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్‌నే డామినేట్ చేసేసినట్లు కనిపించిన ముద్దుగుమ్మ రీతూ వర్మ. ఆ డామినేటింగ్ అప్పీలే ఆమెను హీరోయిన్‌గా మారేలా చేసింది. తరుణ్ భాస్కర్ - విజయ్ దేవరకొండ పుణ్యమా అని 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. తొలి సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇంకేముంది పాపకు మహర్దశ పట్టినట్లే అనుకున్నారు. కానీ, ఏదో రెండు, మూడు సినిమాల్లో కనిపించి మాయమైపోయింది.
యంగ్ హీరో నిఖిల్‌తో 'కేశవ' సినిమాలో నటించింది. ఓ మోస్తరు హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తమిళ పరిశ్రమపై దృష్టి పెట్టింది. తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తమిళంలో ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. అప్పుడెప్పుడో సీనియర్ హీరో విక్రమ్‌తో 'ధృవ నక్షత్రం' సినిమాలో నటించింది. కానీ, ఆ సినిమా ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకోలేదు. సో మన తెలుగమ్మాయికి తమిళనాట కూడా ఏమంత అదృష్టం కలిసొచ్చినట్లుగా లేదు. మళ్లీ తెలుగులో అవకాశాల కోసం గాలించిందట.
ఆ క్రమంలో యంగ్ హీరో నాగశౌర్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. నాగశౌర్య ప్రస్తుతం 'అశ్వద్ధామ' చిత్రంలో నటిస్తూనే, మల్టిపుల్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు. వాటిలో ఒకటి సంతోష్ జాగర్లమూడి సినిమా. ఆ సినిమా కోసమే రీతూ వర్మని హీరోయిన్‌గా ఎంచుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్‌ఫామ్ అయితే, తెలుగమ్మాయ్‌ని మళ్లీ తెలుగులో చూడొచ్చన్న మాటే.