రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న 'రోబో 2.0' సినిమా ఆడియో ఫంక్షన్‌ని దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఈ ఆడియో విడుదల ఫంక్షన్ ఘనంగా జరగనుంది. ఈ ఫంక్షన్ వేదికని అంగరంగ వైభవంగా డెకరేట్ చేయనున్నారట. కనీ వినీ ఎరుగని రీతిలో ఆ అలంకరణ ఉండబోతోందట. ముఖ్యమైన అతిధులను ఈ ఫంక్షన్‌కి ఆహ్వానించనున్నారు. అతిధుల కోసం ఏర్పాటు చేసిన టేబుల్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయట. ఒక్కో టేబుల్ ఖర్చు అక్షరాలా 6 లక్షలు మరి. అంటే ఈ ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. సిని పరిశ్రమలో ఇంతవరకూ ఏ సినిమాకీ చేయనంత ఘనంగా ఈ ఆడియో ఫంక్షన్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ అరగంట పాటు లైవ్ షో ఇస్తుండడం ఈ ఈవెంట్‌లో ప్రత్కేకతను సంతరించుకోనుంది. దుబాయ్‌లో భారతీయులు చాలా ఎక్కువ. ఈ ఈవెంట్‌కి వారంతా హాజరయ్యేందుకు ప్రత్యేక పాస్‌లు ఏర్పాటు చేశారు. ఆ పాస్‌లకి ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఎంతయినా వ్యత్యించి ఈ ఈవెంట్‌కి హాజరవ్వాలనుకుంటున్నారు అక్కడి భారతీయులు. కాగా శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అక్షయ్ పాత్ర, గెటప్ అన్నీ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. 'రోబో' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. అయినా కానీ 'రోబో' కథకీ, '2.0' కథకీ ఎక్కడా పోలిక ఉండదట. కొత్త స్టోరీతో, సరికొత్త గ్రాఫిక్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.