ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్`పైనే అందరి కళ్లూ ఉన్నాయి. బాహుబలి తరవాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ఇది. ఈసారి జక్కన్న ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని లెక్కలేసుకుంటున్నారంతా. కాకపోతే... కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఎన్టీఆర్ టీజర్ కూడా బయటకు రాలేదు. అందుకే.. రాజమౌళి ముందుగా ఎన్టీఆర్ పైనే ఫోకస్ పెట్టాడట. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ నవంబరులో మొదలయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. నవంబరులో ఎన్టీఆర్‌పై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించబోతున్నాడట. ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ హాలీవుడ్ బ్యూటీ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతోందని తెలుస్తోంది. ఆ తరవాత.. ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాన్ని సైతం తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల్లోని షాట్స్ తోనే టీజర్ ని కట్ చేయబోతున్నార్ట. ఎన్టీఆర్ సోలోగా కనిపించే సీన్లన్నీ ముందు తీసేసి, ఆ తరవాత.. చరణ్ తో కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. అంటే.. `ఆర్.ఆర్.ఆర్` నుంచి బయట పడే తొలి హీరో ఎన్టీఆరే అవుతాడు. ఎన్టీఆర్ కమిట్ అయిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ సినిమా ఒకటి. ఎన్టీఆర్ కోసం చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నందున.. రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.