బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లోనూ ప్రతాపం చూపించాడు రాజమౌళి. తెలుగు సినిమాకి హిందీ మార్కెట్ ద్వారాలు తెరచుకోవడానికి బాహుబలి మూల కారణం అయ్యింది. ఆ తరవాత సైరా, సాహోలు కూడా బాలీవుడ్‌కి వెళ్లాయి. సైరా తేలిపోయింది గానీ, సాహో మాత్రం బాలీవుడ్ లో ప్రభావం చూపించింది. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్` కూడా బాలీవుడ్‌కి వెళ్లనుంది. తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈసినిమాని విడుదల చేస్తున్నామని రామమౌళి ఇది వరకే చెప్పారు. అందుకే అజయ్ దేవగణ్ లాంటి స్టార్లని అక్కడి నుంచి పట్టుకొచ్చారు. అయితే రాజమౌళి టార్గెట్ మారింది. హిందీ కంటే, సౌత్ ఇండియా మార్కెట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నార్ట.
హిందీ ఆడియన్స్ కోసం కథలు మార్పులు, చేర్పులూ చేసుకుంటూ పోతే, సోల్ దెబ్బతింటుందని రాజమౌళి భయపడుతున్నాడని టాక్. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల నేపథ్యంలో ఓ ఫిక్షనల్ స్టోరీ ఇది. అల్లూరి, కొమరం భీమ్‌లు తెలుగువాళ్లకు హీరోలు. కానీ.. వీళ్ల గురించి బాలీవుడ్ జనాలకు తెలీకపోవొచ్చు. ఇది హిందీ ప్రేక్షకులపై ప్రభావం చూపించే అవకాశాలు చాలా తక్కువ. ఈ పాయింట్ బాలీవుడ్‌లో వర్కవుట్ అవ్వకపోయే ప్రమాదం ఉంది. అందుకే బాలీవుడ్ పై ఆశలు పెట్టుకుని, అక్కడ భారీగా విడుదల చేసి, ఆ తరవాత భంగపడడం ఎందుకన్నది రాజమౌళి ఆలోచన. అందుకే.. బాలీవుడ్‌పై పెట్టాల్సిన ఫోకస్‌ని రాజమౌళి బాగా తగ్గించేశాడని తెలుస్తోంది.
బాలీవుడ్ ని బోనస్ అని మాత్రమే అనుకోవాలని, దానిపై ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని రాజమౌళి భావిస్తున్నాడట. సో.. ఈసారి `ఆర్.ఆర్.ఆర్` ప్రచారం, ప్రభావం సౌత్ ఇండియాకే పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.