తన సినిమా కథేంటో చెప్పడం రాజమౌళికి కొత్త కాదు. మగధీర నుంచి అదే చేస్తున్నాడు. ఈగ, మర్యాదరామన్న కథలు కూడా ముందే చెప్పేశాడు జక్కన్న. అయితే.. 'ఆర్‌ఆర్‌ఆర్' వరకూ వస్తే రిలీజ్ డేట్ ముందే ప్రకటించేశాడు. 2020 జులై 30 న ఈ సినిమా తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. రాజమౌళి తన సినిమా రిలీజ్ డేట్ ముందే చెప్పేయడం ఇదే తొలిసారి. జక్కన్న మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి దర్శకుడు. తాను అనుకున్న సన్నివేశం అనుకున్నట్టు రావడానికి ఎంత కష్టమైనా పడతాడు.
జక్కన్న చెక్కుడు గురించి చెప్పడానికి బాహుబలి సినిమా చాలు. ఈసినిమాకీ చాలా వాయిదాలు పడ్డాయి. దానికి కారణం.. చెక్కన్న చెక్కుడే. 'ఆర్‌ఆర్‌ఆర్'కీ ఇలాంటి ఇబ్బందులు తప్పకపోవొచ్చు. ఎందుకంటే.. ఇదో పిరియాడికల్ సినిమా. విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. వీఎఫ్ఎక్స్‌తో ముడిపడిన ఏ సినిమా ఓ పట్టాన పూర్తవదు. విడుదల తేదీ మార్చుకోవాల్సివస్తుంటుంది. ఆ విషయం రాజమౌళికి బాగా తెలుసు.
అయినా సరే.. ఈసారి రిలీజ్ డేట్ చెప్పి మరీ వస్తున్నాడు. అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయడం జక్కన్నకు అతి పెద్ద సవాల్. అయితే విడుదల తేదీ ముందే ఫిక్సయిపోవడం వెనుక బలమైన కారణం ఉంది. ఈ సినిమాని బాలీవుడ్‌లోనూ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌లో సినిమా విడుదల చేయాలంటే.. రిలీజ్ డేట్‌పై ముందే ఓ క్లారిటీ వచ్చేయాల్సిందే. అందుకే... రాజమౌళికి విడుదల తేదీ ప్రకటించడం తప్పలేదు.