ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ఖరీదైన చిత్రాలలో `సాహో` ప్రధమస్థానంలో ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపుగా 300 కోట్లు కేటాయించారు. తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ పెరిగిన దృష్ట్యా రూ.300 కోట్లు తిరిగి రాబట్టుకోవడం పెద్ద మేటరేం కాదు. ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలోనే ఆ డబ్బు తిరిగి దక్కించుకోవొచ్చు. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత సంస్థలాంటిది.
ఈ సినిమాలో ప్రభాస్ వాటా పెట్టాడన్నది బహిరంగ రహస్యమే. అయితే.. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా కోసం బయటి నుంచి అప్పులు తీసుకొచ్చార్ట. యూవీ స్టామినా, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాకి అప్పులు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే... ఇలాంటి భారీ చిత్రాలు తెరకెక్కిస్తున్నప్పుడు, టాక్స్ గొడవలు రాకుండా ఉండడానికి నిర్మాతలు అప్పులు చేస్తుంటారు. అలా యూవీ క్రియేషన్స్ ఫైనాన్సియర్స్ నుంచి భారీగా అప్పులు చేసిందట. వాటికి భారీగానే వడ్డీలు చెల్లించాల్సివస్తోందని టాక్.
సినిమా విడుదలకు ముందు ఈ అప్పులు క్లియర్ చేయాల్సిన బాధ్యత యూవీపై ఉంటుంది. అందుకే.. వీలైనంత వరకూ ఈ సినిమాని విడుదలకు ముందే అమ్మేయాలని భావిస్తున్నార్ట. ఓవర్సీస్, నైజాం, హిందీ రైట్స్ రూపంలో యూవీ వాళ్లకు బాగానే గిట్టుబాటు అవుతుంది. కాకపోతే.. వారంతా అడ్వాన్సులే ఇస్తారు. ఏక మొత్తంలో డబ్బులు కట్టేవాళ్లకే ఈ సినిమాని అమ్మాలన్నది నిర్మాతల ఆలోచన. సాహో టీజర్ ఎలాగూ రిలీజైపోయింది కదా. ఇక బేరాలూ మొదలైపోతాయి. ప్రీ రిలీజ్ పరంగా సాహో ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.