సాహో కి ముందు సుజిత్ పేరు మార్మోగిపోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం అంటే మాటలా? అందులోనూ... రూ.300 కోట్ల సినిమా. ఈ దెబ్బతో సుజిత్ బిగ్ లీగ్ లోకి చేరిపోతాడని అంతా ఊహించారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. సాహో అనుకొన్న ఫలితం అందుకోలేదు. దాంతో సుజిత్ ఖాళీ అయిపోయాడు. చాలామంది హీరోలకు కథలు చెప్పినా ఎక్కడా ఓకే కాలేదు. ఇప్పుడు హీరో రెడీగా ఉన్నాడు కానీ, నిర్మాత మాత్రం దొరకడం లేదు.
మెగా హీరో వరుణ్‌తేజ్‌కి సుజిత్ ఓ కథ చెప్పాడు. అది వరుణ్‌కి బాగా నచ్చింది. కానీ నిర్మాత అందుబాటులో లేడు. దానికి కారణం.. ఈ కథ భారీ బడ్జెట్ ని డిమాండ్ చేయడమే. వరుణ్ కి `గని` పెద్ద దెబ్బ కొట్టింది. ఆసినిమాతో నిర్మాత వాష్ అవుట్ అయిపోయాడు. మళ్లీ వరుణ్‌పై అంత బడ్జెట్ పెట్టడం సాహసమే. పైగా.. సుజిత్ తో సినిమా. అందుకే నిర్మాతలు వెనుకంజ వేస్తున్నట్టు టాక్.
ప్రస్తుతం సుజిత్ నిర్మాతని వెదికిపట్టుకొనే పనిలో ఉన్నాడని, నిర్మాత దొరికితే.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని, లేదంటే ఆగిపోతుందని తెలుస్తోంది. మరి సుజిత్ కి నిర్మాత దొరుకుతాడో, లేడో?