ప్రభాస్ తదుపరి సినిమా `జాన్`. ఈ చిత్రాన్నీ యూవీ క్రియేషన్సే నిర్మిస్తోంది. రాధాకృష్ణ (జిల్ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని కూడా `సాహో` రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించాలన్నది చిత్రబృందం ప్లాన్. సాహోలా యాక్షన్ ఘట్టాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు గానీ, రిచ్ లుక్, భారీ తారాగణం కావల్సినంత ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాపై `సాహో` ఎఫెక్ట్ పడింది. సాహో వల్ల యూవీ క్రియేషన్స్, బయ్యర్లూ ఎంతో కొంత నష్టపోక తప్పదు.
సాహోని కొన్నవాళ్లకే `జాన్` కూడా అమ్మాల్సి ఉంటుంది. అంటే సాహో నష్టాల్ని జాన్ తో భర్తీ చేస్తారన్నమాట. అందుకే ఇప్పుడు `జాన్` బడ్జెట్ ని కాస్త కుదించాలని యూవీ నిర్ణయం తీసుకుంది. కథ ప్రకారం యూరప్‌లో చిత్రీకరణ జరగాల్సివుంది. అక్కడ షూటింగ్ అంటే కాస్ట్లీ వ్యవహారం. అందుకే.. యూరప్ షూటింగ్ షెడ్యూల్‌ని కుదించి, ఆయా సన్నివేశాల్ని హైదరాబాద్‌లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
అందుకు సంబంధించిన కొన్ని సెట్లు కూడా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోలో రెడీ చేస్తున్నారు. సాహోలో ప్రతీ చిన్న పాత్రకీ పేరున్న నటీనటుల్ని తీసుకున్నారు. దాని వల్ల బడ్జెట్ పెరిగింది. జాన్‌లో మాత్రం మరీ ఆడంబరాలకు పోకుండా, పొదుపుగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నార్ట. యూవీ క్రియేషన్స్ ఇప్పటికి వాస్తవంలోకి వచ్చిందన్నమాట.