మారుతి సినిమా కోసం బరువు తగ్గే పని మొదలెట్టాడట మెగా మేనల్లుడు తేజు. ఈ మధ్య తేజూ చాలా బరువు పెరిగాడు. తన బరువు ఈ మధ్య సినిమాల్లో బాగా ఇబ్బంది పెడుతోంది తేజూ ఫ్యాన్స్‌ని. తాజా సినిమా 'చిత్రలహరి'లో కూడా తేజు బరువుగానే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే మారుతితో సినిమాకి అప్పుడెప్పుడో తేజు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా సెట్స్ మీదికి వెళ్లాలంటే తేజు బరువు తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందట.
దాదాపు 20 కేజీల వరకూ బరువు తగ్గితే కానీ సినిమా సెట్స్ మీదికి వెళ్లే పరిస్థితి లేదని మారుతి సూచించడంతో సాయి ధరమ్ తేజ్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడనీ తెలుస్తోంది. ఇటీవలే 'చిత్రలహరి' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలాక్స్ అయిన తేజు ఇక కంప్లీట్‌గా డైట్ కంట్రోల్, ఫిట్‌నెస్ వర్కవుట్స్‌పై ఫోకస్ పెట్టనున్నాడట. త్వరలోనే బరువు బాధ్యతలు తగ్గించుకుని, ఈ సినిమాని కూడా పట్టాలెక్కించేయాలనుకుంటున్నాడట తేజు.
మారుతి సినిమాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. సో తేజుతో మూవీ కూడా అదే జోనర్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మారుతి, 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాతో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు మళ్లీ తేజు కోసం 'భలే భలే మగాడివోయ్' రేంజ్ హిట్ కోసం గట్టి కసరత్తులే చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.