కన్నడ ప్రేక్షకులు 'కిచా' అంటూ ముద్దుగా పిలుచుకునే స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'ఈగ' సినిమా సుదీప్‌ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత రాజమౌళి సంచలనం 'బాహుబలి'లోనూ సుదీప్ ఓ కీలక పాత్రలో కనిపించాడు.
కాగా ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న 'పహిల్వాన్' మూవీకి సంబంధించిన టీజర్ సంక్రాంతికి రిలీజైంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న సుదీప్‌ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తేశారు. టీజర్ చూసిన సల్మాన్‌ఖాన్ సోషల్ మీడియా ద్వారా సుదీప్‌ని ప్రశంసించారు. ఆయన ప్రశంసలకు సుదీప్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. టీజర్‌లో సుదీప్ చేస్తున్న కుస్తీ యుద్దం సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి.
గతంలో సల్మాన్ ఖాన్ ఇదే పాత్ర పోషించిన 'సుల్తాన్' మూవీ రికార్డు విజయం అందుకుంది. అదే తరహాలో సుదీప్‌కి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి మరి. మరోవైపు సుదీప్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.