తెలుగు సినిమా ఎప్పుడూ కమర్షియల్ ఛట్రాల చుట్టూనే నడుస్తుంటుంది. ఫక్తు వ్యాపార సినిమాలు చేయడం తప్పడం లేదు. మరీ ముఖ్యంగా కథానాయికలకు. నాలుగు పాటలు, రెండు గ్లామరెస్ సీన్లు, ఓ లిప్ లాక్.. ఇవి ఉంటే చాలు, సినిమాని ఒప్పేసుకోవడానికి. అయితే ఇప్పటి తరం కథానాయికల దృక్పథం మారింది. ఫక్తు రొటీన్ కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం అంగీకరించడం లేదు. సమంత కూడా ఇప్పుడు అదే చేస్తోంది. కమర్షియల్, ఫార్ములా సినిమాలకు ఇకమీదట దూరంగా ఉండాలని షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
''పరిశ్రమకొచ్చి పదేళ్లయ్యింది. ఎంతో కొంత నేర్చుకున్నా. నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు విలువైన కథల్ని ఎంచుకోవాల్సిన తరుణం. ఒకప్పుడు నేను కమర్షియల్ సినిమాలు చేశా. ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రల్నీ ఒప్పుకోవాల్సివచ్చింది. కానీ అప్పుడు తప్పలేదు. యేడాదికి ఇన్ని సినిమాలు చేయకపోతే నన్ను కథానాయికగా గుర్తించరేమో అనే భయం ఉండేది. ఇప్పుడు అలా కాదు. యేడాదికి ఒక్క సినిమా అయినా... గుర్తిండిపోయే పాత్ర దొరికితే చాలు. సినిమాల కోసం పరుగులు తీయడం ఆపేశాను'' అంటోంది. తను కథానాయికగా నటించిన `మజిలీ` ఏప్రిల్ 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.