'రంగస్థలం'తో భలే మాయ చేస్తోంది.

మరిన్ని వార్తలు

'ఏం మాయ చేశావె' అంటే తొలి సినిమాతోనే మాయ చేసిన ముద్దుగుమ్మ సమంత. స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అయితే ఇప్పుడు సరికొత్త మాయాజాలం ఏదో ప్రయోగించనుంది.. 'రంగస్థలం' సినిమాతో. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌ మెస్మరైజింగ్‌ లుక్‌ అది. ఆ లుక్‌ని మెచ్చుకోదగ్గవారు లేరంటే అతిశయోక్తి కాదు కదా. ఇప్పుడు సమంత మాయ మొదలైంది.

 

'రంగస్థలం' నుండి సమంత ఫోటోలు బయటికి వస్తున్నాయి. ఒక్కో ఫోటో ఓ రేంజ్‌లో ఉన్నాయి. అసలింతకీ ఆ ఫోటోల్లో ఉన్నది సమంతేనా? అని అనుమానం కలిగేలా ఓ వైపు. మరో వైపు సమంత సూపర్బ్‌ అంటూ కామెంట్స్‌ పుట్టుకొస్తున్నాయి. 'చిట్టిబాబు'గా చరణ్‌ పాత్ర ఫస్ట్‌లుక్‌కే ఆడియన్స్‌ అంతలా షాక్‌ అయితే, ఇక సమంత పల్లెటూరి అందాలకు మరింత షాక్‌ తినకుండా ఉండలేకపోతున్నారు. పల్లెటూరి అమ్మాయి అంటే గుర్తొచ్చేది, లంగా వోణీ, మధ్య పాపిటతో అల్లిన జడ చివర రిబ్బన్‌తో ముడి.. ఆ జడకి అందం తెచ్చే కనకాంబరాలు.. ఇలాంటి సిగ్నేచర్స్‌ ఉంటాయి. అచ్చంగా అలాంటి సిగ్నేచర్స్‌నే ఈ ఫోటోల్లో సమంతలో చూస్తున్నాం. 

గేదెని తాడుతో లాగుతున్న అమ్మాయిగా, పంప్‌ సెట్‌లో నీరు పోస్తున్న అమ్మాయిలా, పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తున్నట్లుగా, ఆనాటి కాలంలో.. పల్లె పడుచులు ఎలా ఉంటారో అచ్చం అలాగే కనువిందు చేస్తోంది సమంత. ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ మధ్య సమంతని పెళ్లికూతురి గెటప్‌లోనూ, హైలీ అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లోనూ చూసిన కళ్లతో అమాంతం ఇలాంటి సరికొత్త లుక్‌లో చూస్తుంటే అభిమానులు థ్రిల్‌ కాకుండా ఎలా ఉంటారు చెప్పండి. 

ఏదేమైనా సమంత, రామ్‌ చరణ్‌ 'రంగస్థలం' కోసం తమని తాము పూర్తిగా మార్చేసుకున్నారు. లుక్స్‌తోనే ఆడియన్స్‌ హృదయాల్ని దోచేస్తున్నారు. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో! సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. వచ్చే ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS