అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ గుడి. ఆ గుడిలో బోలెడిన్ని నిధి, నిక్షేపాలున్నాయన్న నమ్మకం. దాంతోపాటే కనిపించని శక్తులు కూడా ఉన్నాయన్నది మరో నమ్మకం. దాంతో ఆ గుడిలో ఎవరూ అడుగుపెట్టరు. కానీ, మన హీరో మాత్రం అడుగుపెడతాడు. జీవితంలో ఓ బలమైన అవసరం హీరోని ఆ గుడిలో అడుగుపెట్టేలా చేస్తుంది. అయితే, హీరో మామూలుగా అడుగుపెట్టడు, ఓ స్వామీజీ వేషధారణలో ఆ గుడిలోకి అడుగుపెడతాడు. తనకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్‌తో చిన్నా, చితకా మాయలు చేసి ఊరి జనంలో తనపై నమ్మకం కలిగిస్తాడు.
ఆ నమ్మకంతోనే గుడిలోని నిధి నిక్షేపాలపై అన్వేషణ కొనసాగిస్తాడు. ఆ క్రమంలో ఆయనకు నిజంగానే విలువైన వజ్రాలు, రాళ్లు లభిస్తాయి. అది తెలిసిన ఊరి పెద్ద హీరోని కష్టాల పాలు చేస్తాడు. అయితే మన హీరోకి ఉన్న ఆ పెద్ద అవసరం ఏంటీ.? తనకు దక్కిన నిధిని ఊరి పెద్దల నుండి తప్పించుకుని ఎలా దక్కించుకున్నాడు అన్నదే అసలు కథ. ఇంతకీ ఈ కథ ఎవరిదీ అంటే సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న 'వజ్ర కవచధర గోవింద' సినిమాది. అరుణ్‌పవార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వైభవ్ జోషి హీరోయిన్‌గా నటించింది. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌తో కథ మొత్తం పై విధంగా రివీల్ చేసేశారు. ట్రైలర్ చూస్తే సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తోంది.
ఓ స్టార్ హీరో సినిమాకి ఉండాల్సిన హంగులూ, ఆర్భాటాల మాదిరిగా ఉండాల్సిన అన్ని రసాల్ని సింపుల్‌గా మిక్స్ చేశారు సప్తగిరి సినిమా కోసం. జబర్దస్త్ గ్యాంగ్‌తో పుష్కలమైన కామెడీ పండించారు. యాక్షన్, సస్పెన్స్.. ఇలా ఉండాల్సిన మిగిలిన కమర్షియల్ ఎలిమెంట్స్‌నీ చొప్పించారు. మరి సప్తగిరి తన మొదటి రెండు చిత్రాల మాదిరిగా ఈ సినిమాతోనూ మంచి కమర్షియల్ హిట్ అందుకుంటాడా.? తెలియాలంటే ఈ నెల 14 వరకూ వేచి చూడాల్సిందే.