కొన్నాళ్ల క్రితం ఓ ఆడియో ఫంక్షన్లో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళల్ని కించపరిచేలా ఆ కామెంట్స్ ఉన్నాయని మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. చలపతిరావు వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పినా - ఆ వేడి చల్లారలేదు. ఇప్పుడు చలపతి రావు ఏ ఫంక్షన్లో మాడ్లాడాలన్నా కాస్త వెనకా ముందు ఆలోచిస్తున్నారు కూడా. అయితే.. ఈ విషయంలో ఆయన చాలా మధనపడ్డార్ట. ఓ సందర్భంలో అయితే సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నార్ట.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చలపతిరావునే చెప్పుకొచ్చారు. ''ఇరవై రెండేళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆడవాళ్లంటే నాకు అంత గౌరవం. అలాంటివాళ్లని చులకనగా మాట్లాడతానా? ఈ ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. నన్ను ఇలా అల్లరి పాలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాం. ఇన్నాళ్లు నిప్పులా బతికాను. ఇక బతకనిచ్చేటట్టు లేరు' అంటూ సూసైడ్ నోట్ రాసి, చనిపోదామనుకున్నా'' అని గుర్తు చేసుకున్నారు చలపతి.