'వాల్మీకి' సినిమాలో గద్దలకొండ గణేష్ పాత్రలో కనిపించాడు వరుణ్ తేజ్. ప్రచార చిత్రాలు చూసిన ఆడియన్స్ ఈ గెటప్‌లో వరుణ్ విశ్వరూపం చూపించాడంటున్నారు. కానీ, ఈ పాత్రలో ఇంకా బాగా నటించాల్సి ఉందనిపించేదట సెట్స్‌లో ఉన్నంతసేపూ వరుణ్ తేజ్‌కి. కానీ, ఉన్నంతలో తన పూర్తి ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా 'వాల్మీకి' అని చెబుతున్నాడు వరుణ్ తేజ్. డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీ లైన్ చెప్పగానే ఈ పాత్ర తనకు నచ్చేసిందట. కానీ, మేకోవర్ పరంగా అంతలా డిజైన్ చేస్తాడని ముందు అనుకోలేదట.
ఆ మేకోవర్‌కే నాకు ప్రశంసలు దక్కుతున్నాయంటున్నాడు వరుణ్‌తేజ్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడని అంటున్నారు. కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసిన నెగిటివిటీనే తప్ప, గెటప్‌లో కనిపించినంత ఘోరంగా ఉండదనే సీక్రెట్ రివీల్ చేసేశాడు వరుణ్. రెండు రకాల డిఫరెంట్ షేడ్స్‌లో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. రెండూ ఛాలెంజింగ్ రోల్సే. రెండింటినీ మ్యానేజ్ చేయడం చాలా కష్టమైందట.
కానీ, తృప్తినిచ్చిందంటున్నాడీ మెగా ప్రిన్స్. ఈ నెల 20న మన గద్దలకొండ గణేష్ 'వాల్మీకి'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్ మంచి మనిషిగా ఎలా మారాడన్నదే ఈ 'వాల్మీకి' కథ. హీరోయిన్ పూజా హెగ్దే పాత్ర సినిమాకి కీలకం. తమిళ హీరో అధర్వ మురళి మరో ప్రధాన పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అధర్వకు జోడీగా మృణాళిని రవి నటించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించబడింది. మిక్కీ జె మేయర్ సంగీతమందించారు.