రకుల్ ప్రీత్ సింగ్ తాజా బాలీవుడ్ సినిమా 'దే దే ప్యార్ దే' ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. అంటే, రేపే ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించబోతోందన్నమాట. అయితే, ఇంతలోనే రకుల్ ప్రీత్ సింగ్‌కి పెద్ద షాక్ తగిలింది. సెన్సార్ బోర్డ్, సినిమాలోని రకుల్ ప్రీత్ సింగ్‌కి సంబంధించిన కొన్ని సీన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందట.
అందులో రకుల్, మద్యం బాటిల్‌ని పట్టుకుని డాన్స్ చేసే సన్నివేశాలు ముఖ్యమైనవట. ఓ పాటలో రకుల్, మద్యం సీసా పట్టుకుని డాన్స్ చేయడం, ఆ పాట ఆల్రెడీ సెన్సేషన్ అవడం తెలిసిన సంగతే కదా. ఆ పాట మీద రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆశలే పెట్టుకుంది. కానీ, సెన్సార్ బోర్డ్ ఆ సాంగ్ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా, బీర్ బాటిల్ కనబడనీయకుండా బ్లర్ చేయడమో, గ్రాఫిక్స్‌తో మార్చడమో చేయాలని ఆదేశించిందట నిర్మాతలకి.
సెన్సార్ ఆదేశాల నేపథ్యంలో బాటిల్‌ని బ్లర్ చేయడం ఖాయమంటున్నారు. గ్రాఫిక్స్ చేసి, ఏ ఫ్లవర్ బొకేనో పెడదామంటే, పాట అర్థం మారిపోతుంది. ఎలా చూసినా, ఈ టైమ్‌లో ఇది ఆ సినిమా దర్శక నిర్మాతలకి పెద్ద సంకటమే. ఈ పాట గురించి మాత్రమే కాదట, సినిమాలో రకుల్ గ్లామర్ డోసు ఎక్కువైందనీ, దానికీ కత్తెర పడనుందనీ తెలుస్తోంది.