అక్కినేని బుల్లోడు నాగచైతన్య నటిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కాగా 'శైలజారెడ్డి అల్లుడు' అంటే అత్తా - అల్లుళ్ల నేపథ్యంలో సాగే కథ. నో డౌట్. గతంలో ఈ తరహా నేపథ్యంలో చాలా చాలా చిత్రాలు తెరకెక్కాయి. మంచి విజయం అందుకున్నాయి. అంతకన్నా ఈ సినిమాలో కొత్తగా ఏం చూపిస్తారులే అనుకుంటే పొరపాటే. గత చిత్రాల మాదిరి రెగ్యులర్ అత్తా అల్లుళ్ల సవాళ్లు ఈ సినిమాలో ఉండవట. ఓ సామాన్య యువకుడి క్యూట్ రొమాంటిక్ లవ్‌స్టోరీ 'శైలజారెడ్డి అల్లుడు' అని డైరెక్టర్ మారుతి చెబుతున్నాడు. అలాగే మారుతి చిత్రాలంటే ఓ మార్కు ఏర్పడింది. ఖచ్చితంగా హిట్ ఫార్ములానే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
నేచురల్ స్టార్ నానికి 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో ఎలా బ్రేక్ వచ్చిందో అలాగే నాగచైతన్యకు 'శైలజారెడ్డి అల్లుడు' మంచి బ్రేక్ అవుతుందని యూనిట్ మొత్తం నమ్మకం వ్యక్తం చేస్తోంది. పండగ రోజు నవ్వుల పండగలాంటి చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' అవుతుంది. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా, సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
అనూ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. శైలజారెడ్డిగా రమ్యకృష్ణ పాత్ర 'బాహుబలి'లో శివగామి పాత్ర తర్వాత ఆ స్థాయిలో మెచ్చుకోదగ్గదిగా ఉంటుందని అంటున్నారు.