ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సాహో' కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరుని ఫైనల్ చేశారట. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయినా కానీ ఇంతవరకూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదీ ఫైనల్ కాలేదు. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రబాస్ నటిస్తున్న సినిమా ఇది. 'బాహుబలి'తో ప్రభాస్ యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. దాంతో ఆయనతో జత కట్టేందుకు స్టార్ వేల్యూ ఉన్న బ్యూటీ కోసం గాలింపు కొనసాగుతోంది. టాలీవుడ్ నుండీ, బాలీవుడ్ నుండీ పలు పేర్లు విన్పించాయి ఇంతవరకూ. కానీ అవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది ఈ విషయంలోనూ. బాలీవుడ్‌లో హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గట్టిగానే ఉన్నా సొంత టాలెంట్‌తో ఎదిగిన బ్యూటీ ఈమె. సింగింగ్ టాలెంట్ ఈమెకు అదనపు ఆకర్షణ. పలు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి నటిగా నిలదొక్కుకుంది. బాలీవుడ్‌లో అస్సలేమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. '1 నేనొక్కడినే' సినిమా టైమ్‌లోనే శ్రద్ధా కపూర్ పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా విన్పించింది. పలువురు నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నించినా, అప్పట్లో కుదరలేదు. ఈసారి 'సాహో' టీమ్ శ్రద్ధా కపూర్‌ని ఒప్పించిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో చూడాలి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.