తమిళ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుండి ఆయన తమిళనాడులో పర్యటించనున్నారు. ప్రజలతో మమేకం కానున్నారు. ఆ దిశగా పలువురు రాజకీయ ప్రముఖులను కమల్ కలవనున్నారు. ఈ బుధవారం ఆయన తన రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. మధురైలో పార్టీ పేరును ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ కుమార్తై అయిన శృతిహాసన్ ట్విట్టర్‌లో స్పందించారు. 'నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కానీ నాన్న రాజకీయాల్లోకి వచ్చినందుకు ఓ కూతురుగా గర్వంగా ఉంది. ఆయన రాజకీయ ప్రయాణంలో నేను ఎప్పుడూ తోడుంటాను. ఆయనకే పూర్తి మద్దతిస్తాను. రాజకీయాలపై అవగాహన లేకుండా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. కానీ ఓ కూతురుగా ఆయనకే నా ఫుల్ సపోర్ట్..' అని శృతిహాసన్ తెలిపింది.
ఇకపోతే ఈ బుధవారం రామనాధపురంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన రాజకీయ పార్టీ అజెండా ఏంటో కమల్ వివరించనున్నారు. అసలు తను రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఏంటి? రాజకీయాల్లో ఆయన ఏం చేయబోతున్నారు అనే విషయాలపై కమల్ వివరణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రామేశ్వరంలోని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం నివాస గృహాన్ని ఈ సందర్భంగా కమల్ సందర్శించనున్నారు.
అనంతరం ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. కమల్‌హాసన్ రాజకీయాల్లోకి రావడానికి ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ ఎంతో కష్టపడ్డారనీ, ముఖ్యంగా తండ్రికి రాజకీయాల్లో అక్షర హాసన్ ప్రత్యక్షంగా సహాయ పడనుందని సమాచారమ్.