'భాషను ప్రేమిస్తే అది తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తుంది. తన గాత్రంతో కాకుండా ఇతరుల గాత్రానికి తాము నటించడం పెద్ద మోసం.' అంటున్నారు హీరో సిద్దార్ద్. 'బాయ్స్' చిత్రంతో సుపరిచితుడైన సిద్దార్ద్ తెలుగులో 'బొమ్మరిల్లు', నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తదితర సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే తర్వాత కెరీర్‌లో చాలా గ్యాప్ తీసుకున్నాడు.
బేసిగ్గా మనోడు మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. చాక్లెట్ బోయ్‌గా అమ్మాయిల మనసుల్ని దోచుకున్నాడు. ఇటీవలే 'గృహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, హీరోగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటాడు. తనకున్న చాక్లెట్ బోయ్, లవర్ బోయ్ ఇమేజ్‌ని పక్కన పెట్టి, హారర్‌తో కొత్త జోనర్ ట్రై చేసి, సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడీ చాక్లెట్ బోయ్ మరో కొత్త ఆలోచన చేశాడు. తాజాగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'కమ్మార సంభవం' అనే ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరో దిలీప్ కాగా, సిద్దార్ద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం సిద్దార్ద్ చాలా కష్టపడ్డాడట.
గెటప్ కూడా కొత్తగా ట్రై చేశాడు. అంతేకాదు, తొలిసారిగా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడట సిద్దార్ధ్. ఈ సందర్భంగానే మనోడు పైన చెప్పిన నీతి వాక్యాలు బోధిస్తున్నాడు భాష గురించి. ఏది ఏమైనా సిద్దార్ద్ మంచి మాటే చెప్పాడులే. అవును భాషపై పట్టు సాధిస్తే, నటనలో మరిన్ని ప్రశంసలు దక్కించుకోవచ్చు. ఆ విషయాన్ని గ్రహిస్తే, ప్రతీ ఆర్టిస్టూ తన వృత్తిని మరింత సక్సెస్‌ఫుల్‌గా, హార్ట్ ఫుల్‌గా నిర్వర్తించే అవకాశం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.
అందుకే ఈ మధ్య టాలీవుడ్‌లో అందాల భామలు పట్టు పట్టి తెలుగు భాష నేర్చుకుని పోటా పోటీగా తెలుగులో తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు. నిజంగా ఇది మంచి పరిణామమే.