దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. సింగీతం సతీమణి లక్ష్మీ కల్యాణీ శనివారం రాత్రి 9 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సింగీతం స్వయంగా మీడియాకు తెలియజేశారు. 62 ఏళ్ల అద్భుతమైన దాంపత్య జీవితానికి నేటితో తెరపడిందంటూ.... సింగీతం ఆవేదన వ్యక్తం చేశారు. `అమ్మలాంటి వ్యక్తిని కోల్పోయా`నని ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య సంతాపం వ్యక్తం చేశారు. సింగీతం సతీమణి మరణ వార్త విని.. టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, విచిత్ర సోదరులు లాంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలు అందించారు సింగీతం. ఈ వయసులోనూ సింగీతం హుషారుగా ఉంటారు. దానికి కారణం నా భార్యే అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ సహధర్మచారిణిని కోల్పోయి పుట్టెడు విషాదంలో మునిగిపోయారు సింగీతం.