గాయని చిన్మయి శ్రీపాద ఈ మధ్య వార్తల్లో తెగ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'మీ టూ' అంటూ బాలీవుడ్ బ్యూటీ తనూరాయ్ చేపట్టిన పోరాటంలో భాగంగా తమిళ లిరిక్ రైటర్ వైరముత్తు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ చిన్మయి చేసిన ఆరోపణలతో వార్తల్లోకెక్కింది చిన్మయి. అప్పటి నుండి చిన్మయి ఏదో ఒక విషయమై వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. మీటూ వివాదంతో పాటు, ఈ మధ్య రకుల్ తదితర హీరోయిన్స్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లకు కూడా చిన్మయి స్పందించింది.
ఇక తన పట్ల జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు తనకు ఇండస్ట్రీలో చిన్న చూపు ఎదురైందనీ, అవకాశాలు రావడం లేదనీ, నోరు తెరిచి నిజం చెప్పడమే ఇందుకు కారణమైందనీ చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో గాయనిగా చిన్మయి మంచి పేరు తెచ్చుకుంది. ఈ మీటూ వివాదంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయట. అదే విషయాన్ని ప్రస్థావిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అంతేకాదు, ఈ వివాదాల కారణంగా సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తన పట్ల అసభ్యకరమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారనీ చిన్మయి వాపోయింది. తనకిష్టమైనచోట పని దొరక్కపోతే, ఇతర భాషల్లోనైనా పని వెతుక్కుంటాను కానీ, మనసుకు వ్యతిరేకంగా పని చేయనని చిన్మయి తేల్చి చెప్పేసింది. నాకు జరిగిన అన్యాయంతో మరే ఆడపిల్లా తనకు న్యాయం చేయమని నోరు తెరిచి అడిగే సాహసం చేయదని చిన్మయి అసహనం వ్యక్తం చేసింది.