ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకుంది గతంలో శ్రీదేవి. అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన 'మామ్' సినిమాకి లేటెస్టుగా నేషనల్ అవార్డు లభించింది. కానీ ఇప్పుడు ఆమె జీవించి లేదు. శ్రీదేవి జీవించి ఉంటే బాగుండేది. చనిపోయిన తర్వాత ఆమెకి దక్కిన అపురూప గౌరవమిది. తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అతిలోక సుందరికి ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన 'మామ్' చిత్రానికిగానూ ఆమెకు ఈ ఉత్తమ నటి అవార్డును ప్రకటించారు.
అవును నిజమే ఈ సినిమాలో ఆమె మామ్‌గా అత్యుత్తమ నటన కనబరిచింది. జీవించి ఉంటే అటువంటి మరిన్ని పాత్రలు పోషించి అభిమానుల్ని తన అందంతో, అద్భుతమైన నటనతో మెప్పించి ఉండేది. అంత గొప్ప నటి కాబట్టే, మొన్నీ మధ్య జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్‌లో ఆమెను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధించారు. ఇటీవల దుబాయ్‌లోని మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవి తాను బస చేసిన హోటల్ రూమ్‌లోని బాత్ టబ్‌లో పడి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈ జాతీయచలన చిత్ర అవార్డ్స్‌లో మరో తెలుగు సినిమాకి అవార్డు దక్కింది. అదే 'ఘాజీ'. ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయని సెన్సిటివ్ అండ్ క్రిటికల్ కాన్సెప్ట్ అయిన సబ్‌మెరైన్ నేపథ్యంలో సాగే చిత్రంగా 'ఘాజీ' తెరకెక్కింది. రానా హీరోగా కొత్త డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకుందీ సినిమా.