ఎంత పెద్ద దర్శకుడైనా, అంతకు ముందు ఎన్ని హిట్లు కొట్టినా, ఎన్ని అవార్డులు అందుకన్నా - ఒక్క ఫ్లాప్ వాళ్లని కుంగదీసేస్తుంది. గతంలో కొట్టిన బ్లాక్ బ్లస్టర్ హిట్స్ కూడా వాళ్లని కాపాడలేవు. శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్‌లే ఇందుకు ఉదాహరణలు.
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో శ్రీకాంత్ తనదైన మార్క్ సృష్టించుకున్నాడు. అయితే బ్రహ్మోత్సవం ఆయన కెరీర్‌ని బాగా దెబ్బకొట్టేసింది. ఎంతలా అంటే.. మరో సినిమా ఇవ్వడానికి నిర్మాతలు, కథ ఒప్పుకోవడానికి హీరోలూ భయపడేంతగా.
బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితీ అంతే. ఒంగోలు గిత్త డిజాస్టర్ ఆయన్ని గిల గిల లాడించేసింది. బొమ్మరిల్లు లాంటి సూపర్ డూపర్ హిట్ ఆయన ఖాతాలో ఉన్నా - అది కూడా అవకాశాల్ని సృష్టించలేకపోయింది. చివరికి ఈ ఇద్దరు దర్శకులకూ గీతా ఆర్ట్స్ ఓ వేదిక కల్పించింది. అడ్వాన్సులు చేతిలో పెట్టి కథలు తయారుచేయమంది.
అయితే హీరోలు దొరికితేనే కదా. శ్రీకాంత్ అడ్డాల కథ రాసుకుని చాలా కాలం అయ్యింది. ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పి చూశాడు కూడా. కానీ ఏ ఒక్కరి నుంచీ స్పందన లేదు. బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి కూడా ఇంతే. ధైర్యం చేసి హీరోలెవరూ ముందుకు రావడం లేదు. ఇది వరకటి పరిస్థితులు ఇండ్రస్ట్రీలో లేవు. ఇక్కడ ఓ ఫ్లాపు తగిలితే కోలుకోవడం కష్టం. అందుకే ఏ ఒక్కరూ రిస్కు తీసుకోవడానికి రెడీగా లేరు. మరి.. ఈ దర్శకులకు హీరోలెప్పుడు దొరుకుతారో, సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కిస్తారో..?