ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన శ్రీను వైట్ల, ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. మాస్ హీరో రవితేజ ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల తెరకెక్కించిన తాజా చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోని'. ఈ సినిమా కథ పరంగా.. టేకింగ్ పరంగా.. ఘోర వైఫల్యాన్ని చవిచూడటంతో శ్రీను వైట్లతో మూవీ అంటేనే ఏ హీరో కూడా ముందుకు రావడంలేదు.
అలాంటిది.. తాజాగా ఓ హీరో శ్రీను వైట్లకు ఒకే చెప్పినట్టు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. మంచు విష్ణునే. ప్రస్తుతం విష్ణు సినీ కెరీర్ కూడా ఇబ్బందుల్లో ఉందనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా కూడా ప్లాప్ అయ్యింది. 2012లో వచ్చిన 'దేనికైనా రెడీ' సినిమా తర్వాత విష్ణుకి సరైన హిట్ ఒక్కటీ లేదు.
సో.. తను కూడా మంచి కథ కోసం చూస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఢీ' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి అలాంటి హిట్ ప్లాన్ చేస్తున్నారట. వీరిద్దరూ ఇప్పుడు చేయబోయే సినిమా 'ఢీ' చిత్రానికి సీక్వెల్ గా ఉండబోతుందని సినీ వర్గాల సమాచారం.